![]() |
![]() |
(ఆగస్ట్ 21 రాధిక పుట్టినరోజు సందర్భంగా..)
తెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన నటన, చలాకీతనం, వర్సటైల్ పెర్ఫార్మెన్స్‌తో సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటి, నిర్మాత రాధికా శరత్‌కుమార్. తమిళనాట అగ్ర నటుడు, విలన్‌గా గుర్తింపు పొందిన ఎం.ఆర్.రాధ కుమార్తెగా సినీ ప్రవేశం చేసిన రాధిక, తండ్రి బాటలోనే నటనలో తనదైన ముద్ర వేశారు. దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన 'కిళక్కే పోగుమ్ రైల్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె, తొలి చిత్రంతోనే విశేష ఆదరణ పొందారు.
తెలుగు సినీరంగంలో మెగాస్టార్ చిరంజీవితో నటించిన 'న్యాయం కావాలి' చిత్రంతో అడుగుపెట్టిన రాధిక, తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించారు. ఆ తర్వాత చిరంజీవితో 'కిరాయి రౌడీలు', 'అభిలాష', 'పట్నం వచ్చిన పతివ్రతలు', 'దొంగమొగుడు', 'ఆరాధన', 'రాజా విక్రమార్క' వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి విజయవంతమైన కాంబినేషన్‌గా నిలిచారు. చిరంజీవితో అత్యధిక చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన ఘనత కూడా రాధికకే దక్కడం విశేషం.
శోభన్ బాబు, చంద్రమోహన్, మురళీమోహన్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన రాధిక, కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా 'స్వాతిముత్యం', 'స్వాతికిరణం', 'త్రిశూలం', 'రాధాకళ్యాణం', 'మూడుముళ్ళు' వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నారు. డాన్సుల్లో తనదైన వేగం, నటనలో సహజత్వంతో నటిగా అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఏడాది రాధిక ప్రధాన పాత్రలో వచ్చిన 'తాయ్ కిళవి' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి స్టార్ హీరోల స్థాయిలో కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలోని ఆమె నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
వెండితెరపై నాయికగానే కాకుండా కేరెక్టర్ ఆర్టిస్టుగానూ, బుల్లితెరపై ధారావాహికలు, రాడాన్ మీడియా ద్వారా నిర్మాతగానూ రాధిక విశేష విజయాలు సాధించారు. దక్షిణాది భాషలన్నింటిలో నటించిన రాధికా శరత్‌కుమార్ మున్ముందు మరిన్ని విజయవంతమైన చిత్రాలు, పాత్రలతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Radhika Sarathkumar Birthday, Actress Radhika Movies, Radhika Chiranjeevi Hit Movies, Radhika Sarathkumar Special Story
![]() |
![]() |